కోవిడ్‌ క్రాష్‌ : అంబానీకి నష్టం ఎంతంటే?

 ముంబై: కోవిడ్‌-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా  ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా  వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో  దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు.  (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్‌)




ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని  బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్  బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్‌ బిలియనీర్‌ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది.  (టెక్‌ దిగ్గజాలకు కోవిడ్‌-19 సెగ)